తెలంగాణకు 12 లక్షల టన్నులయూరియా సప్లై చేశాం..ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం: కిషన్ రెడ్డి

తెలంగాణకు 12 లక్షల టన్నులయూరియా సప్లై చేశాం..ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: రబీ సీజన్‌‌‌‌కు సంబంధించి తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్‌‌‌‌  టన్నుల యూరియా కోటా అవసరం కాగా, కేంద్ర ప్రభుత్వం 12.02 లక్షల మెట్రిక్‌‌‌‌  టన్నుల యూరియాను సరఫరా చేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌‌‌‌  రెడ్డి తెలిపారు. రైతులకు అమ్మకం పోగా ఇంకా రాష్ట్రం వద్ద 1.68 లక్షల మెట్రిక్‌‌‌‌  టన్నుల యూరియా ఉందని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన వెల్లడించారు.

డీఏపీ కోటా 1.50 లక్షల మెట్రిక్‌‌‌‌  టన్నులు కాగా, 1.72 లక్షల మెట్రిక్‌‌‌‌  టన్నులు సరఫరా చేశామని చెప్పారు. అమ్మకం పోగా రాష్ట్రం వద్ద 0.26 లక్షల మెట్రిక్‌‌‌‌  టన్నుల డీఏపీ నిల్వ ఉన్నట్లు- పేర్కొన్నారు. 2014 నుంచి నేటి వరకు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులను ఎరువుల సబ్సిడీల రూపంలో కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు.

గతంలో ఎరువుల కోసం రైతులు చెప్పులను క్యూలైన్లలో పెట్టి పడిగాపులు కాసిన సందర్భాలు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల నేడు రైతులకు అలాంటి ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఎలాంటి లోటు- లేకుండా ఎరువులను సరఫరా చేశామన్నారు. అవసరాలు తీరిపోను ఇంకా ఆయా రాష్ట్రాల వద్ద నిల్వలు ఉన్నాయన్నారు.